స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Thursday, 31 May 2018

T.V. మన జీవితంలో ఎంత మమేకమైపోయిందో... ఎంతగా మనల్ని ప్రేరేపిస్తోందో ... ఈ పాటద్వారా తెలియజేసే చిన్న ప్రయత్నం.
పల్లవి:
ఏం మాయ జేసావో దేవుడా !!! TV
మడిసి కొంప ముంచినావే దేవుడా!!!
చరణం-1:
కళ్లు నులుముకుంటూనే నీ మీటని నొక్కుతున్నరు,
పళ్లు తోమకుండానే రిమోటుని ఒత్తుతున్నరు,
బల్లమీద పళ్లెంకాస్త ఒళ్లోనే పెడతవున్నరే,
ఎన్నెన్ని సిత్రాలో దేవుడా, నీవి
ఒంటేలొచ్చిన ఆగమంటరే దేవుడా!!! //ఏం మాయ //
చరణం-2:
సీరియళ్లు జూస్తూనే వంట,మంట గలుపుతున్నరు,
వికెట్లెన్ని పడ్డాయంటూ ఫైళ్లుమూసి పోతావుంటరు,
బొమ్మల చానళ్లు జూస్తూ, బంతాటలు మరిసిపోతిరే,
ఏమేమి ఆటలే దేవుడా, నీవి
పుస్తకాలకి సెదలడుతున్నయ్ దేవుడా!!! //ఏం మాయ //
చరణం-3:
మిడ్డీ, చెడ్డీలు ఏసి ఫేసన్ టీవీ సోకులంటరు,
నేరాల్, ఘోరాలు జూస్తూ ఓనమాలు దిద్దుతున్నరు,
పార్టీ పంచాయతీలతో, పచ్చి తెలుగుని నేరుస్తున్నరే,
ఎంతెంత వింతలో దేవుడా, నీవి
బూతులేమో, జోకులాయే దేవుడా!!! (జబర్దస్త్...) //ఏం మాయ //
=========================================
కె.కె.

Tuesday, 20 January 2015

గుప్పెడు మల్లెలు-83


1.
మానవత్వం అనేది పెద్ద జోక్ అయిపోలా,
ఆదిమానవుడికి నవ్వడం తెలిసుంటే
ఉండేదా ఇలా?
2.
నిరుద్యోగం ఒక సమస్యా...
చర్చిస్తున్నాం ఇంతలా?
ప్రేమకు ప్రైస్ టాగ్ కట్టేస్తే పోలా.
3.
చీకటిని తిడతావెందుకు?
దీపం వెలిగించడం మానేసి,
ఇప్పుడెందుకీ ఏడుపు, డబ్బులకి ఓటేసి
4.
"రేపు" అన్న దానికీ హద్దులున్నాయ్,
దాని దగ్గర, ఈ రోజు పుట్టిన
నీ సందేహాల పద్దులున్నాయ్.
5.
ప్రేమ ఒక ఇటుక బట్టి,
కాబట్టి... ఇల్లు కట్టావచ్చు,
కప్పెట్టి సమాధి కట్టావచ్చు.
6.
స్వార్ధం అనేది నార్మల్ కాదు,
ఈ రోజుల్లో అది....
జస్ట్ .... కామన్.
7.
సముద్రాన్ని కొలవాలంటే,
ఒడ్డు కనబడకూడదు,
లక్ష్యం అందలేదా! పడ్డ శ్రమ చాల్లేదు.
8.
ఎలాంటి వలలో చిక్కుకున్నాం,
మొదటి ఊహనుంచే మొదలెట్టేసాం,
మనల్ని మనం మోసం చేసుకోవడం.
9.
ఎక్కడున్నావన్నది
పెద్ద విషయం కానేకాదు,
అక్కడున్నావ్...అదీ నిలబడే ఉన్నావ్.
10.
హీరో అంటే ఎవడు?
మనకన్నా ధీరుడా...కాదు...
కాస్త ఓపిక ఎక్కువున్నోడు.
========================
Date: 20.01.2015

Friday, 16 January 2015

గుప్పెడు మల్లెలు-82

1.
ప్రయత్నిస్తాననకు... అది లేనేలేదు,
ఉన్నవి రెండే...
చెయ్యడమో, మానెయ్యడమో
2.
పొరపాటు చేస్తే,
సరిదిద్దుకోవాలిలే...
లేదంటే... అది పొరపాటేలే
3.
ఇరుక్కుని కూర్చోవడమెందుకోయ్,
విసుగొచ్చేవరకూ...
ఆలోచిస్తూ... నిలదొక్కుకునేందుకు
4.
మనసే కఠినం, మన శరీరంలో
మనషులం కదా...
మృదుత్వం ఉండేది చేతుల్లో
5.
ఇరవయ్యేళ్లో,అరవయ్యేళ్లో
ఎన్నాళ్లు బతికి ఏం లాభం?
ఎంతోకొంత గుర్తించకుంటే ఈ ప్రపంచం.
6.
"అది అసాధ్యం" అనేవాడు,
అటువైపుగా రానేరాడు...
ఆ పని నువ్వు చేసేటప్పుడు
7.
కన్నీటి పొరని
కంటికి అంటనివ్వనోడు...
కళ్లముందుదేదీ చూడలేడు.
8.
నీ చాయ ఉండాలి,
నిన్ను నమ్మిన ప్రపంచంలో...
లేదంటే...నువ్వున్నట్లే చీకట్లో
9.
వారాంతం లెక్కలోకి రాదు
వాడేస్తే తప్ప...
ప్రణాళిక లేకుండా
10.
లైఫంటే ఒక కాక్ టైల్,
మిక్స్ చేసుంటాయ్ కష్టాల్, సుఖాల్
లేదంటే నో కిక్ ఎటాల్.
==========================
Date: 15.01.2015

Monday, 29 December 2014

గుప్పెడు మల్లెలు - 81

1.
రుద్దిన ప్రతీసారీ,
నొప్పని ఏడిస్తే... మెరుగు ఎలా?
మణి కైనా... మనకైనా...
2.
మనిషెంత ఎదిగితే,
దాక్కునే ప్రదేశం అంత తగ్గిపోతుంది,
అందుకేనేమో... మానేసారు చాలామంది.
3.
ఓడ భద్రమే... ఒడ్డునుంటే,
అక్కడే ఉంటే....
నవ్విపోరా... దాన్ని ఓడ అంటే
4.
ఒక్క గెలుపొస్తే ఆపేస్తామా,
ఒక్క ఓటమికే మానేస్తామా,
ఏది, ఏమైనా... ఆడక చస్తామా
5.
నిన్ను,నువ్వు వెతుక్కోవడమో,
కనుక్కోవడమో కాదు జీవితం,
అది...నిన్ను,నువ్వు సృష్టించుకోవడం.
6.
ఒక తలుపు మూసుకుపోతే,
వేరేది తెరిచే ఉంటుంది,
మనమే... మూసిన దగ్గరే ఉండిపోతుంటాం.
7.
హర్రర్ సినిమా చూసాక,
మిర్రర్ చూసినా పుడుతుందోయ్ భయం,
కానీ...ప్రతీ సినిమాలో దేవుడిదేనోయ్ జయం.
8.
ప్రతీవాడు కళాకారుడే,
గీసేస్తుంటాడు, ఊహాచిత్రాలు,
అవున్లే...విజ్ఞానికేగానీ, ఊహలకేవీ హద్దులు
9.
సుఖంగా బతకాలంటే ...
కన్ఫ్యూజనొద్దు,కనిపించినవన్నీ అద్భుతమనుకో...
లేదా... అద్భుతమన్నది అస్సలు లేదనుకో
10.
అమాయకత్వంలో అందం,
పిచ్చిలో తత్వం దాగుంటాయ్...అందుకే...
లోకాన్ని వాటికి నచ్చినట్టు చూస్తుంటాయ్.
==================================
Date: 28.12.2014

Saturday, 15 November 2014

చాకిరేవు-09

"బాబాయ్, ఓ రెండు,మూడు ఫేమిలీలు కలిసి అలా ఏదైనా పిక్నిక్ వెళ్లొద్దాం. చాలా బోరు కొడుతోంది. ఎప్పుడూ అవే కాలేజీ గోడలు, అవే లెక్చరర్ ఫేసులు, అవే సినిమాలు... బోర్... చాలా బోర్..." అన్నాడు అబ్బాయ్ స్నానం చేసివస్తూ...
"మన ఇంటి సుట్టుపక్కల ఎవరైనా అమ్మాయిని గిల్లేవేట్రా... పిక్నిక్కులు గట్రా అంటన్నావ్" అన్నాడు బాబాయ్ చదువుతున్న పేపరు మూసేస్తూ...
"ఛా... ఛా... ఈ మొహాల్న.... మన రేంజే వేరు బాబాయ్. అయినా నేనేం చెప్పినా అందులో ఎప్పుడూ తప్పులెతుకుతావేంటి నువ్వు." అన్నాడు అబ్బాయ్ అలిగినట్టు ఫేస్ పెడుతూ...
"ఏం లేదులే, సటుక్కున అంత మంచి ఆలోసన ఒచ్చింది కదా, దానెనకాల ఏదైనా కుట్రాలోసన ఉందా... అని సిన్న రాయి ఇసిరేను అంతే... ఇంతకీ ఎక్కడెకెల్తే బాగుంటదంటావ్?" ఆశక్తిగా అడిగాడు బాబాయ్.
"అబ్బా... ఇవ్వాళ వర్షం పడుతుంది. మొదటిసారి నువ్వు నా ఆలోచన మంచిది అని సర్టిఫికేట్ ఇచ్చినందుకు చాలా హేప్పీసు... సింలా, ఊటీ, డార్జిలింగ్ ఇందులో ఏదైనా ప్లేసుకి వెళదాము." అన్నాడు అబ్బాయ్.
"ఒరేయ్, అంతంత దూరాలు ఇప్పుడు అవసరమేట్రా?" అన్నాడు బాబాయ్.
"మనింటెనకాల ఎర్ర చెరువు దగ్గర కాసేపు కూర్చొని ఒచ్చేద్దాం... సరేనా... " అన్నాడు అబ్బాయ్ వెటకారంగా
"మరీ అంత ఎకసెకాలు అక్కర్లేదు లేవోయ్. ఇప్పుడు పరీక్సలు గట్రా ఉంటాయి అంటారేమో అని. అందరూ ఇంజనీరింగ్ సదివే కుర్రోల్లే కదా... నీకు,నాకూ అంటే పనీ,పాటా లేదు కాబట్టి ఏ ఊరు అన్నా లగెత్తుకు ఎలిపోతాం." అన్నాడు బాబాయ్.
"అవునవును, అందరూ ఇంజనీర్లే... ఈ ఇంజనీరింగ్ అంటే అంత పిచ్చి ఎందుకో అర్ధం కాలేదు. పుట్టడం పాపం కొడుకైతే ఇంజనీరు, కూతురైతే డాక్టర్... మిగిలినవి ఉద్యోగాలు కాదు మరి. అందుకే "త్రీ ఈడియట్స్" సినిమాలో వాయించి పడేసాడు అమీర్ ఖాన్." అన్నాడు అబ్బాయ్.
"ఆడి మొహం, ఆడికేటి తెలుసురా. ఎవడికైనా సలహా జెప్పడం అంత సులభం మరొకటి లేదు. సలహా చెప్పినంత ఈజీ కాదు, బతుకు బండి లాగడం అంటే..." అన్నాడు బాబాయ్ తాపీగా...
"అంటే, ఆ సినిమాలో చెప్పినదంతా తప్పే అంటావా? ఆ సినిమాకి ఎన్ని అవార్డులు, రివార్డులు వచ్చాయో తెలుసా? అయినా నీకు హిందీ అర్ధం అవ్వక అలా మాట్లాడుతున్నావ్?" అన్నాడు అబ్బాయ్.
"అబ్బాయ్, సినీమా అర్ధం అవ్వాలంటే బాస రావాలి అన్నది నిజమే అయినా, పూర్తిగా తెలవక పోయినా ఇసయం ఏటో తెలిసిపోద్ది. అయినా అది తెలుగులో కొడా నేను సూసాను. సినీమాలో సెప్పిందంతా నేను తప్పనడం లేదురా, కానీ అందులో సెప్పిందానికి బతుకులో జరుగుతున్నదానికి సాలా తేడా ఉంది." అన్నాడు బాబాయ్.
"ఏమిటో మాకు అర్ధం అవ్వని ఆ ఇసయం." అన్నాడు అబ్బాయ్, బాబాయ్ భాషలోనే...
"పిచ్చోడా, మన సమాజంలో మూడు రకాల తరగతులు ఉన్నాయి. మొదటిది డబ్బున్నోడు... ఆల్ల అమ్మా,బాబులు సంపాయించి పెడితే ఈ నాకొడుకు దాన్ని ఎలా కర్సుబెట్టాలా అని ఆలోసిస్తుంటాడు. రెండోది పేదోడు... ఆడికి ఆరోజు తిండి ఎలాగ అని ఆలోసన తప్ప, ఏరే ఏ ఆలోసన ఉండదు. మూడోది మద్య తరగతోడు ఈడి ఆలోసన ఎప్పుడూ ముందు తరగతిలోకి ఎప్పుడు ఎల్దారా అనే ఉంటది. మొదటి రెండు తరగతులకి టెన్సన్ ఉండదు. మొత్తం సికాకు అంతా మూడో తరగతోడితోనే... ఆడు కొనే బట్టలు తక్కువలో రావాలి, సూడ్డానికి డాబుగా ఉండాలి. ఈ ఆలోసనలతోనే ఆడు ఒక ముప్పై దుకాణాలు తిరిగి, ఒక సొక్కా కొంటాడు. ఆడు సేసే పెతీ పనీ అంతే. అందుకే మినిమం గేరంటీ ఎక్కడుంది అని సూస్తాడు. ఆల్ల కుర్రోడికో, కుర్రదానికో ఈడు పడే బాదలు రాకూడదని అలోసిస్తనే ఉంటాడు. ఆడు సైకిల్ తొక్కితే, కొడుకు స్కూటర్ నడపాలనుకుంటడు. ఆడు స్కూటర్ తొక్కితే, కొడుకు కారెక్కాలనుకుంటడు. ఆడి ఆస్తి మొత్తం, ఆడి పిల్లలే అనుకుంటడు. ఇప్పుడన్న కాలమాన పరిస్తితులు బట్టి, ఆ ఇంజనీరు సదువు అయిపోతే ఏదో ఒక నౌకరీ దొరుకుద్ది... అదీ గేరంటీగా, అన్నది ఆడి ఆలోసన. ఒక వేళ నిజంగా ఆ గుంటడికి ఏరే ఏదో ఇంట్రెష్టు ఉందనుకో, ఈడు ఎంత కష్టపడి సదువు సెప్పించినా ఆ ఎదవ ఆడి రూట్లోనే పోతాడు. ఇక ఆ సినీమా అంటావా... అది సచిన్ టెండుల్కరో, బాలు లాటి కొంతమంది పెత్యేకమైన మనుసుల కోసం. మన సుట్టూ ఏవరేజీ మనుసులే ఎక్కువరా అబ్బాయ్. ఆడు ఇంజనీర్ అయ్యాడనుకో, శతకోటి లింగాల్లో ఒక బోడి లింగం. అయినా ఆ లింగానికి అబిసేకం ఉంటది. ఆడు బొమ్మలు బాగా ఏస్తున్నాడనో, పాటలు బాగా పాడతున్నాడనో సదువు, సంజ మానేసి ఆటెనకాల పడితే సంక నాకి పోతారు. ఆటి సక్సస్ రేటు 2% మాత్రమే. ఇంజనీరు అంటావా, గుంపులో గోవింద కొట్టుకుంటూ బతికేస్తారు. దీని సక్సస్ రేటు 50 కన్నా ఎక్కువే. ఎవరు అవునన్నా, కాదన్నా... మద్యతరగతోడు సదువుకునేది మాత్రం, ఒక మంచి ఉద్యోగం సంపాయించడానికే. మద్యతరగతి మనస్తత్వం అంతే."
"సరే ఈ సోదంతా నువ్వు ఒప్పుకోవు గానీ, పదా మీ పిన్నిని, పాపల్ని అడిగి ఎదో ఒకటి ప్లాన్ సేద్దాం." అని లోపలికి దారి తీసాడు బాబాయ్.
=============================
Date: 02/09/2014  

Friday, 14 November 2014

గుప్పెడు మల్లెలు - 80

1.
ప్రపంచమంతా విద్యార్ధులే,
జీవితంలో పరీక్షలొచ్చాయో...
నైట్ అవుట్లే
2.
దేవుడిచ్చాడు మగాడికి,
మెదడు,మర్మాంగం ఒక్కొక్కటే
నెత్తురు మాత్రం... పనిజేసేందుకు ఒక్కటే
3.
ఉండాలోయ్ అమ్మాయికి మంచి గతం,
అబ్బాయికి మంచి భవితం,
అవిలేని పెళ్లికి, ఎందుకోయ్ కులం,మతం.
4.
మనిషి, తాను తప్పుచేసానని,
చప్పున ఒప్పుకునేది...
మరుపు మెదడు తట్టినప్పుడే
5.
నరకం స్పెల్లింగు
నూరుసార్లు దిద్దినట్టే,
భాషరాని చోట, భావం ప్రకటించాలంటే
6.
గిట్టుబాటుకాని పట్టింపులు,
అసందర్భంగా ఢీకొనే అభిప్రాయాలు,
ఇవే... మద్యదూరాల కొలమానాలు
7.
అలోచిద్దాంలే, జుట్టు తెల్లబడ్డాక...
అనుకుంటూ ఉంటారు అంతా,
రంగు పూసేస్తారు తెలుపు కనబడకుండా
8.
పగటిపూట పట్టుదప్పి కిందపడ్డ కాలు,
రాత్రంతా ఎత్తులో మహరాజులా...
బళ్లు,ఓడలౌతాయ్... నమ్మకతప్పదు.
9.
కప్పు నిండుగా కాఫీ ఉండగా,
తుమ్మొస్తే భలే ఉండదా,
నిస్సహాయ స్థితికి నిదర్శనం ఇదేకదా!
10.
విచక్షణన్నది మనలో వాణి ,
హెచ్చరిస్తుంటుంది ఎల్లప్పుడూ
మనల్నెవరో వాచ్ చేస్తున్నారని.
===========================
తేదీ: 06.11.2014

Tuesday, 26 August 2014

చాకిరేవు-08

"ఏట్రా అబ్బాయ్ టి.వి. చూస్తన్నావా, ఇయ్యాల కాలేజీ సెలవా?" అడిగాడు బాబాయ్ బయటనుంచి వస్తూ...
"లేదు బాబాయ్, కాస్త ఒంట్లో నలతగా ఉన్నాది. అందుకే కాలేజీకి వెళ్లలేదు." అన్నాడు అబ్బాయ్.
"అయ్యో,అదేట్రా... నువ్వు మాంచి ప్లేయరువి, నీకు జొరమేటెహె... మరి డాక్టరు కాడికి ఎల్లకపోయావా?" అన్నాడు బాబాయ్.
"లేదులే బాబాయ్, ఇప్పుడే టేబ్లెట్ వేసుకున్నాను. పిన్ని మిరియాల కషాయం ఇచ్చింది. సాయంత్రం కల్లా తగ్గిపోతుందిలే. అప్పటికి తగ్గకపోతే అప్పుడు వెళతాను." అన్నాడు అబ్బాయ్.
"సరే... సరే... మరి రెష్టు తీసుకోకుండా టీ.వీ.కాడ కూకున్నావెందుకురా" అన్నాడు బాబాయ్.
"బోర్ కొడుతోంది బాబాయ్... అందుకే టీ.వీ. చూస్తున్నాను. ఈ ప్రోగ్రాములు చూస్తుంటే మరింత బోరు కొడుతోంది." అన్నాడు అబ్బాయ్.
"అదేట్రా, ఐదేల్ల గుంటడి కాడ్నించి... అరవయ్యేల్ల ముసిలోడు వరకు టీ.వీ.కాడ రోజు మొత్తం కూకొనే ఉంటన్నారు. ఆడోల్లకి సీరియల్ కతలు, సిన్న గుంటలకి కార్టూన్ బొమ్మలు, నీలాటి కుర్రోల్లకి ఆటలు, పాటలు, సినీమాలు, కిరికెట్టు మాచీలు, నాలాటి ముసిలోల్లకి వార్తలు... ఇలాగ సుమారు వంద సానల్లలో ఆల్లు ఫోగ్రాములు ఎడితే, నువ్వు పుసుక్కుమని బోరు అనీసేవు. బోరైతే సానల్ మార్చాలా, అంతేగాని సిరాకు అడిపోకూడదు." అన్నాడు బాబాయ్.
"సినిమాల గురించే బాబాయ్, నేను చెప్పేది. ఇప్పటికీ ఆరు చానళ్లు మార్చి చూసాను. అన్నింటిలోని చంపుకోవడం, నరుక్కోవడం. చంపడంలో వింత,వింత పద్దతిలు చూపిస్తూ జనాల్ని చెడగొడుతున్నారు. హింస ఇంతలా పెరిగిపోయింది అంటే దానికి 90% కారణం ఈ సినిమాలే... సెన్సార్ బోర్డ్ నిద్రపోతోంది అనుకుంటా. అసలు ఇప్పుడున్న ప్రొడ్యూసర్లకు సామాజిక బాధ్యత లేదు. దానికి తోడు ఈ టీ.వీ.ల్లో ప్రోగ్రాములు అలాగే ఏడ్చాయి." అని తన బాధ మొత్తం వెళ్లగక్కేసాడు అబ్బాయ్.
"అంటే ఇప్పుడు జరుగుతున్న దొంగతనాలు, దోపిడీలు, రేపులు ఇయ్యన్నీ సినీమాలవల్ల, టీ.వీ.లవల్లేనంటావ్" అన్నాడు బాబాయ్.
"అవును, అదే ముమ్మాటికి నిజం. ఈ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు అందరూ కలిసి సమాజాన్ని నాశనం చేసేస్తున్నారు. మంచి సినిమాలు రావడమే లేదు. ఒక శంకరాభరణం, స్వాతిముత్యం, రుద్రవీణ, సాగర సంగమం, ఆ నలుగురు లాంటి సమాజానికి ఉపయోగపడే సినిమాలు రావడం లేదు. అన్నీ హింస పూరితమైన సినిమాలు లేదా వెకిలి చేష్టలతో కామెడీ చేసే సినిమాలు. సమాజం నాశనం అయిపోతోంది అనే ఆలోచన లేకుండా పోయింది ఎవ్వరికీ..." అన్నాడు ఆవేశంగా అబ్బాయ్.
మళ్లీ తనే చెబుతూ "ఇక టీ.వీ.ల్లో అవే కార్యక్రమాలు. డబుల్ మీనింగ్ డైలాగులుతో కామెడీ షోలు, పిచ్చి గెంతులతో డాన్స్ ప్రోగ్రాములు, డబ్బులతో ఆటలు, అన్ని సీరియల్సులో ఒక్కో మగాడికి ఇద్దరో, ముగ్గురో ఆడోళ్లతో లింకు... ఇవే కధలు. అసలు సమాజం ఏమి అవుతుందో అన్న కనీస బాధ్యత లేకుండా పోతోంది." అన్నాడు అబ్బాయ్.
"ఓరి పిచ్చోడా, సినీమాల వల్లో, టీవీల ఫోగ్రాముల వల్లో ఏ ఒక్కడూ బాగుపడ్డమో, పాడైపోవడమో జరగదురా అబ్బాయ్.
అదే గనక జరిగితే ....
-సినీమాలో హీరోలాగ, పతీ తప్పుని నిలదియ్యాల, మనం ఆ సుట్టుపక్కల ఆగమన్నా ఆగం.
-లంచం తీసుకున్నోడిని కనుక్కుని మరీ సంపియ్యాల, కానీ మనమే ఆ సినీమా టిక్కెట్టు బ్లాకులో కొంటాం.
-కులం, మతం అనే మాటలు సెరిపియ్యాల. కానీ అది రోజులో ఒక్క పాలి కూడా తలుసుకోకుండా నిద్దరవ్వం.
-కష్టపడి పనిజేసి అమ్మ,బాబుల్ని పోసించాల. మరి ఓల్డేజీ హోములు ఎన్నున్నాయో నేను సెప్పక్కర్లేదు.
-పెద్దోడి దగ్గర దొంగతనాలు సేసి, పేదోడికి ఎట్టాల. మరి ఈ జనం కనిపించిన ముష్టోడికి ఒక రూపాయి ఇవ్వడానికి అరగంట ఆలోసిస్తారు.
-పోనీ కనీసం ఇలన్ సేసే ఎదవపనులన్నీ సేస్తూ కూకోవాల. కానీ అదీ సెయ్యరు, కూకొని దానిగురించి ఇస్లేసన మాత్రం సేస్తారు.
అంచేత నేను సెప్పొచ్చిదేటంటే సినీమా అనేది కాలక్సేపానికేగానీ, పాఠాలు చెప్పడానిక్కాదు." అన్నాడు బాబాయ్.
"అదేంటి బాబాయ్, అలా మాట్లాడుతున్నావ్? అంటే ఎలాంటి సినిమా తీసిన పర్వాలేదా? ఆ భాష వల్ల తెలుగు మర్చిపోయే స్థాయికి వచ్చేసారు అందరూ... చివరికి సినిమా పేర్లు కూడా ఇంగ్లీషులోనే." అన్నాడు అబ్బాయ్.
"అబ్బాయ్, సినిమా అనేది ఒక యాపారం. జనాలు సూసేది ఆల్లు తీస్తారు, ఆల్లు తీసేది జనాలకి నచ్చితే సూస్తారు. ఒక సినీమా హిట్టైతే, అలాంటియి మరో పది తీస్తారు. ఒక రెడ్డి బాగుందన్నారని, మరో పది రెడ్లొచ్చాయి. టీ.వీ.ల్లో అయినా అదే పిలాసఫీ... ఒక కామెడీ సో నచ్చిందన్నారని, మరో పది తీసేరు. సూసీవోడు లేడనుకో ఆల్లు సేసీది కూడా ఏటుండదు. ఈ మద్య ఒక ముసిలమ్మ, ముసిలాయన్ని ఎట్టి మిధునం అని ఒక సినిమా తీసేరు, ఆహా... అచ్చతెలుగు సినిమా అని కబుర్లు సెప్పే ఎంతమంది టిక్కెట్టు కొనుక్కుని హాల్లో ఆ సినిమా సూసేర్రా? ఆ మద్య లవకుశ మల్లీ తీసేరు, అదెంతమంది సూసేరు? అంచేత సినీమానో, టీవీనో తిట్టుకుని ఉపయోగం లేదురా అబ్బాయ్. ఏం చేసినా, అది జనం... అంటే మనం. సినీమా సూసి ఎవడు రేప్ సెయ్యాలనుకోడు, రేప్ సేద్దాం అనుకున్నోడు సినీమా సూసినా/సూడకపోయినా సేస్తాడు. కాకపోతే అది సినిమా పక్కీలో జరిగిందని ఇదిగో నీలాటి కుర్రకారు కబుర్లాడతారు. ఇలాటియ్యి బాగా ఇంటన్నారని, టీ.వీ.లో బొమ్మ సూపిస్తన్నారు. అప్పుడెప్పుడో అన్నగారు, మందు దొరక్కుండా ప్రొహిబీసన్ ఎట్టేరు. అప్పుడు జనాలు, బీదర్ ఎల్లో, యానాం ఎల్లో, ఒరిస్సా ఎల్లో తాగొచ్చీవోరు. ఆడు తాగుదాం అని డిసైడ్ అయ్యాక, ఎవడు సేసేది ఏటీ ఉండదు. అంచేత నేను సివరాకరుగా సెప్పేది ఏటంటే, ఏ తప్పైనా ఏ ఒక్కడో సెయ్యడు. అందులో నువ్వు, నేను జనాలంతా కలిసే ఉన్నాం. కాకపోతే ఎవడికి ఆడే గులివింద గింజ." అని బాబాయ్ అక్కడ్నించి భోజనానికి వెళ్లిపోయాడు.
============================================
Date: 25.08.2014