స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Thursday, 22 March 2012

శాస్త్రం-సత్యం

అహింసయే పరమధర్మం అంటూ బోధిస్తూ..
అడ్డొచ్చిన వాడిని హతమారుస్తారు!

రామ,లక్ష్మణుల కధలు వినిపిస్తూ..
సోదరుణ్ణే సొమ్ముకొరకు ముంచేస్తారు!

దైవం ముందర జనులెల్లరు సమానమనుచు...
పంచముణ్ణి అంటొద్దని వెలివేస్తారు!

మానవసేవ మాధవసేవగా ప్రకటిస్తూ...
గుడిసెలను కూల్చేసి, గుడి కట్టేస్తారు!

చెప్పేందుకే శాస్త్రం...జరిగిన చరితం...
చేసేదంతా సత్యం... దారుణకృత్యం...

K.K.

ఆశ-గజల్

తలపునై నీ గుండె తలుపులు తెరవాలని ఆశ...
పిలుపునై నీ పెదవి తలమును తడపాలని ఆశ...

చిత్రమైన చైత్రమాసపు చల్లగాలుల వేళలో...
ఊయలూగే పూవునై నీ జడని చేరాలని ఆశ...

పిచ్చి పనులతో,రెచ్చగొడితే కోపగించే నీ కళ్ళలో...
కెంపునై నీ అందానికి మెరుగు దిద్దాలని ఆశ...

తడియారబోసిన నీ నల్ల కురులు నీలిమబ్బుని తలపించగా...
కిరణమై ఆ చీకటి సిగ నిమరుతూ పులకించాలని ఆశ...

జ్ఞాపకాల అలజడిని రేపే నీ ప్రేమ సుడిగుండాన...
ఎదురీదుతూ మరణించాలని ఆశ... నా ఆశ...

కె.కె.

నా రిక్షా చక్రం

గిరా,గిరా తిరుగుతూ...
ఎత్తులెన్నో ఎక్కుతూ...
బరువు లెన్నో ఎత్తుతూ...
పల్లాలను తొక్కుతూ...
గతుకుల్లో,ముక్కుతూ...
మూల్గుతూ...
ఆగకుండా...అలవకుండా...
తిరుగుతున్న భూగోళం...
నా రిక్షా చక్రం!!!

పెట్రోల్ ధర పెరిగినా...
డీజిల్ ధర మండినా ...
నా నెత్తురు చమురుగా...
నా ముచ్చెమటల ధారలే...
స్నేహతైల తీరుగా..
గుక్కెడు గంజికి కరువై...
నెత్తిన సూరీడు బరువై...
నే సోలిన... తూలినా..
ఆగకుండా...అలవకుండా...
తిరుగుతున్న భూగోళం...
నా రిక్షా చక్రం!!!

ముళ్ళెన్నో గుచ్చినా...
రాళ్ళెన్నో గిచ్చినా...
పై తోలుకి ఎన్నిసార్లు...
కత్తుల వైద్యం చేసిన...
కొత్తముక్క లతికినా...
నా బతుకు బండి లాగుతూ...
నా ఆలు,బిడ్డల చల్లగా చూసేటి తల్లి...
నా రిక్షా చక్రం!!!

తీసికట్టే దీనిముందు...
లోకాలను పాలించే ఆ దేవుడి
సుదర్శన చక్రం!!!

నా రిక్షా చక్రం!!! నేల మీద నక్షత్రం!!!

కే.కే.

Friday, 9 March 2012

నవ్యలోకం

 మంచితనం ముసుగులో,వంచించే కుళ్ళుని కడిగేయాలనివుంది!!!
మాకెందుకులెమ్మని, పక్కకు జరిగే కళ్ళను తడిచెయాలనివుంది!!!

గ్రహచారం... గోచారం... అంకెలతో గుణకారం....
చేతిగీతలే, బ్రతుకుబాటగ నమ్మే కల్లను తుడిచేయాలనివుంది!!!
మాకెందుకులెమ్మని, పక్కకు జరిగే కళ్ళను తడిచెయాలనివుంది!!!

అందరి నెత్తురు ఎరుపు... బాధలో అమ్మనే పిలుచు....
దేవుడికే గడిగీసే, మూడాంధుల ఎల్లను చెరిపేయాలనివుంది!!!
మాకెందుకులెమ్మని, పక్కకు జరిగే కళ్ళను తడిచెయాలనివుంది!!!

పసిపాపల బోసినవ్వు... విరబూసిన జాజిపువ్వు....
కపటమంటే ఎరుగని, నవ్యవనం వీధుల్లో చల్లగా గడిపేయాలనివుంది!!!
మాకెందుకులెమ్మని, పక్కకు జరిగే కళ్ళను తడిచెయాలనివుంది!!!

అభిమానం,ఆత్మీయత...అనుబంధం,ఆరాధన...
నవ్యలోక ఆహ్వానంతో గుండెల సడిచేయాలనివుంది!!!
మాకెందుకులెమ్మని, పక్కకు జరిగే కళ్ళను తడిచెయాలనివుంది!!!

కె.కె.

పాపం ఎవ్వరిదని?

రోడ్డు పక్క,గట్టు మీద...
ఆకులేని మోడులా..
ఆచ్చాదన లేకుండా...
కూర్చున్నాడొక పిల్లోడు...
ముక్కుతూ,మూల్గుతూ...
ముసిరే ఈగలతో యుద్ధం చేస్తూ...

ముక్కుపచ్చ లారలేదు...
చిక్కుజుట్టు తీరులేదు...
కళ్ళలోని కాంతిలేదు...
బిచ్చమెత్తు శక్తిలేదు...

ఆరేడేళ్ళు దాటని వయసు...
ఆకలితప్ప అన్యమెరుగని మనసు...
పక్కనున్న బండరాతినే ...
పక్కగా తలచి సోలెను వాడు.

పొగ చిమ్ముతూ మోటర్ బళ్ళు..
సెగ గక్కుతూ తోపుడు బళ్ళు...
సాగుతు ఉన్నాయ్..దాటుతు ఉన్నాయ్...
తాము మరోలోకం అన్నట్లు...

ఆ పాపడు మరణిస్తే...
ఆ పాపం ఎవ్వరిదని...
ఆకాశం ప్రశ్నిస్తు...
కార్చెను కన్నీటి ధారావర్షం...

చిమ్మ చీకట్లు కమ్మెనప్పుడు...
దుమ్మూ,ధూళీ రేగెనక్కడ...
ఎగిరొచ్చిన్ దెక్కడి నుంచో...
ఒక ఎంగిలి విస్తరి..వాడిముందుకు...
నేనున్నా నేస్తం అంటూ!!!

కె.కె.

Thursday, 1 March 2012

ఒక్కసారి వచ్చిపో


ఒక్కసారి వచ్చిపో... బస్తీ సోదరా...
నీకోసం పల్లె వేచి..ఎదురు చూస్తోందిరా...

భోగి పండగొచ్చిందంటే కాగుతాము చలిమంట...
కారులోన షికారుపోతే తీరేనా ఆ ముచ్చట...
సంకరాంతి పండగ వస్తే రంగవల్లి సిరిపంట...
ఏ షాపింగ్ మాలునైన ఆ అందం గాంచునా...

...
ఆ చలిమంటల కోసం...సిరిపంటలకోసం...
ఒక్కసారి వచ్చిపో... బస్తీ సోదరా...
నీకోసం పల్లె వేచి..ఎదురు చూస్తోందిరా...

ఏటిగట్టు పాటలు...తోటలోన ఆటలు...
చిన్ననాడు కట్టుకున్న ఇసుకలోన కోటలు...
చిన్న చిన్న ఆనందాలు..గుండె నిండు మకరందాలు...
ఏ చీకటి క్లబ్బులోనో... చిందులేస్తే తీరునా...

ఆ ఆటలకోసం... ఆ కోటలకోసం...
ఒక్కసారి వచ్చిపో... బస్తీ సోదరా...
నీకోసం పల్లె వేచి..ఎదురు చూస్తోందిరా...

అమ్మచేతి లాలన.. నాన్నగారి దీవెన...
ఎంత మంది చెంతనున్న ఆ భావన సాటగునా..

ఆ లాలనకోసం... ఆ దీవెనకోసం...
ఒక్కసారి వచ్చిపో... బస్తీ సోదరా...
నీకోసం పల్లె వేచి..ఎదురు చూస్తోందిరా...

K.K.

వేచియుంటి

చెలీ! నే వేచియుంటి...
నీ కరుణావ్రుష్టికై వేచియుంటి...
నిన్ను చూడక ఆర్తి మనసుతో
ఎన్నినాళ్ళో నే వేచియుంటి...

హ్రుదయమున ఆనందమెరుగ...
ఎరుగ చిత్త శాంతము...
నిదురనెరుగ...సుఖమునెరుగ...
వెదుకుచుంటి నా కళ్ళే ...
ఆత్రుతతో వేచియుంటి....

అనుతాప గానంతో...
అనురాగ గీతంతో...
మేను మరచి...నిన్నే వలచి...
వెదుకుచుంటి.... నే వేచియుంటి....

నీ వదనము అగుపించక...
నీ కౌగిలి తరియించక...
నీ ఒడిలో నిదురించక...
నిలువలేక వెదుకుచుంటి...
నా ప్రియనెచ్చెలి...నడిచేటి జాబిలి...
నే వేచియుంటి...నీకై వేచియుంటి....

K.K.

సంఘర్షణ

నీలిమబ్బు నీడలలో...
నింగినుంచి రాలుతున్న...
నీటిచుక్క జాడలలో...
మొలవని మొక్కని చూసా...
ఫలితం దక్కని ఆశని చూసా...

పల్లెలు పట్టుకొమ్మలని...
రైతన్నలే రాజులని ...
... విద్యుత్తుని ఉచితమని...
సబ్సిడీలో విత్తులని...
కోతలకాలం దాటినా...
రాతలు మారని బతుకులు చూసా..
గీతలు మారని చేతులు చూసా...

ఊరవతల నీరింకిన
చెరువు ఇసుక మేటలు...
బరువెక్కిన కన్నీటితో
నిండుకున్న కుండలు...
చెల్లిని నిండుగ కప్పని గుడ్డని చూసా...
గుక్కెడు గంజిని నింపని చిప్పని చూసా...

కాలం దయ చూపినా...
దళారి కసిచూపుల చిక్కిన...
అప్పుల తిప్పలు తప్పని...
కాలవలోని ఓ ఆకారం చూసా...
ఆక్రందనల హాహాకారం చూసా...

ఇది ఒక విలయం
ఇది ఒక ప్రళయం
ఒక సంక్షోభం
ఒక సమ్రంభం
ఇది ఒక సంఘర్షణ!!!