స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Sunday, 6 May 2012

గుప్పెడు మల్లెలు - 3

1) విమర్శకు విలువలు ముఖ్యం...
రంద్రాన్వేషణ చేస్తే, సంద్రాన్నైనా దొంగనొచ్చు..

2) 'బాద్యత' పులిమీద స్వారి...
అది వదిలేస్తే మనిషిగా చచ్చినట్లే...

3) సరిగమలు తెలియకున్నా...
ఆలుమగలు విద్వాంసులే... అను'రాగం'లో...

4) అవినీతుందని గుర్తేలేదు...
'అన్నా'అన్నంతవరకు.... అన్నీ చెప్పాలెవరో...

5) ఉగాది నెలకోసారొస్తే...
కనీసం మనం తెలుగోళ్ళమని, కాస్త గుర్తుండేదేమో...

6) గిల్లికజ్జాల రోజుల్పోయాయ్...
ఇప్పుడన్ని గల్లీ యుద్ధాలే...విద్యార్దుల్లో...

7) ఫట్నవాసం.. ఏమో అనుకున్నా...
వెనకనుంచి మగాడ్ని గుర్తించడం కష్టమే...

8) బాధపెట్టి బోధపరిస్తేనే...
తత్వం తెలిసేది...ఉపవాసాలందుకే...

9) గురు,శుక్రుల్లో గొప్పెవరంటే...
శుక్రుడే... రాక్షసరాజ్యం విస్తరించేగా...నలుదిశలా

10) భోజనకాలే... భగవన్
నామస్మరణహః... 'సార్, ఇప్పుడే వస్తున్నా'...

గుప్పెడు మల్లెలు - 2

1) వయస్సులో...రాళ్ళన్నా దొరకవు..
వయస్సు మీరాక పళ్ళైనా అరగవు..

2) మనిషొక్కడే సృష్టిలో....
పక్కా ప్లానింగ్ తో తప్పు చేసేది....

3) మాటల్లో పడి మర్చిపోయాడేమో...
మనిషి... మనిషిగా బ్రతకడం...

4) లోకాన రవిని...శోకాన
కవిని... ఎవరో మేల్కొలపాలా???

5) దుర్మార్గుణ్ణి సుఖంగా ఉండనీ...
సన్మార్గుడు ప్రశాంతంగా ఉంటాడు!!!

6) ప్రేమకు ప్రశ్నుండదు...
విరహానికి సమాధానముండదు...

7) తీపి అబద్దాలే బాగుంటాయేమో ఒక్కోసారి...
కవుల భావుకతలాగ... నిజం కాదని తెలిసినా...

8) చీమలు నడిచినా బండలు అరుగుతాయి....
బాంబులు పేల్చినా బండలు కరుగుతాయి..... సమయం తేడా....

9) చిన్నంబాని ఆలికి ఇమానం
కొన్నాడంట....సొమ్మున్నోడు తుమ్మినా ఇసేసమే......

10) వినయంతో.... చరిత్ర చదువు....
విజ్ఞతతో.... తిరిగిరాయి....

11) ఏదైనా... ఆస్వాదిస్తేనే....
అనుభవం పొందినట్లు..... కదా!!!

12) సంసారం.... సాగరం...
తప్పించుకోలేము... తప్పుకోనూలేమూ...

13) సంసారం.... సాగరం...
తప్పించుకోలేము... తప్పుకోనూలేమూ...

14) విచిత్రమైనది వెదురు....
ముక్కు చెక్కితే బాణం.... ప్రాణం తీస్తానంటూ...
మద్య పొడిస్తే గానం.... ప్రాణం పోస్తానంటూ....

15) ఫోర్జరి విద్య మొదలెట్టేది..
మొదలయ్యేది.... ప్రోగ్రస్ కార్డులనుంచే....

Friday, 4 May 2012

మా ఊరి స్టేషన్లో.. మండే వేసవిలో..

రైలొచ్చి ఆగంగానే
ఏవేవో పలకరింపులు
ఎన్నెన్నో పులకరింతలు
వీడుకోలు కౌగిలింతలు
కొన్ని ఆత్రంగా.. కొన్ని ఆర్ద్రంగా

ఎర్ర చొక్కాల కోలాహలం
టే,కాఫీల మాయా మేళం
వెయిటింగ్ లిస్ట్ గందరగోళం
హిందీపాటల మాదాకోళం
కొన్ని ఆత్రంగా.. కొన్ని ఆర్ద్రంగా

హోరెత్తించే ఎనౌన్స్ మెంట్లు
పడకగా మారే న్యూస్ పేపర్ కార్పెట్లు
చీట్లపేకల హడావిడి చేసే సీజన్ టికెట్లు
ఉక్కపోతకు గుక్కలుపెట్టే చంటిపాపల తల్లులపాట్లు
కొన్ని ఆత్రంగా.. కొన్ని ఆర్ద్రంగా

అతిధులు ఎందరు వచ్చినా
ఆప్తులు ఎందరు వెళ్ళినా
చలించక.. చెమర్చక
జాలిలేని రైలు భారం గా కదిలేస్తుంది
ఊళేస్తూ ... తనకేమి పట్టనట్లు
మా ఊరి స్టేషన్లో.. మండే వేసవిలో..

Wednesday, 2 May 2012

గుప్పెడు మల్లెలు - 1

1)నావ గోదారిని దున్నేస్తుంటే...
   చంద్రుడి సేద్యం వెన్నెల విత్తులు చల్లేస్తూ
2) ఇష్టం లేని పెళ్ళి.. తేలుస్తుంది
    మొరాయించే మనసు బరువు ఎన్ని టన్నులో...
3) ఓడానని బాధ పడకు...
    ఎలా ఆడకూడదో తెల్సినందుకు ఆనందించు...
4) రోడ్డుపై ప్రతిబండిని ఆపి...
    కధలల్లే పోలీస్ కన్నా భావుకుడెవ్వరు???
5) నీడకు నిజం తెలుసేమో...
    నేలతోనే ఉంటుంది.. నేనక్కడకే వస్తానని...25apr12
6) బతుకంతా నీటిమయం.. నోట
   చొంగతో ప్రారంభమై, కుండ చిల్లుతో అంతం...25apr12
7) చాలామంది బ్రతికేస్తున్నారు
    చంపడం చట్టవ్యతిరేకం కారణం గా...
 
8) పంచదారలో ముంచిన కుంచె
   విదిల్చిన బొట్లు కాబోలు... నీ పిలుపు...
 
9) అబద్దానికి అబద్దం అని
    ఒప్పుకోడానికి భయం... నిజంగా మారాలని...
 
10) చావు స్టాంప్ అతకించని
      పోస్ట్... ఫైను కట్టి మరీ తీస్కోవల్సిందే
 
11) జీవితాన్ని పండించుకునే
     సేద్యం పెళ్ళి.. ప్రేమనే ఎరువుతో...
 
12) మాసినగుడ్డ ఈ రాజకీయం
      ఎంత ఉతికినా ...చిల్లుపడుతుందేమోకాని తెల్లబడదు...
 
13) అంతమెరుగని ఆశ...
      అంతుచిక్కని దైవం మనిషికి ఆక్సిజన్...
 
14) ఒక్కముద్దని లాగే జిహ్వ...
      లక్షల పదాల్ని వదుల్తుంది..అదుపు ముఖ్యం...
 
15) మనకి ఆధునికత లాభించింది ఒక్క పేర్ల విషయం లోనే...
      కుల,మతాల వాసనలిచ్చే తోకలు కత్తిరించేసాయ్....వసుదైక కుటుంబం
 
16) ఊరికే వచ్చిన ధనం మెదడుని దొలిచేస్తుంది...
      తేరగా వచ్చిన బంధం మనిషినే కాల్చేస్తుంది...
 
17) చీకటికి ధైర్యం చెబుతుంది
      కీచురాయి... మనిషిని భయపెడుతూ...
 
18) రాక, పోకల మద్య వారధి
       జీవితం... కొన్ని సున్నితంగా...కొన్ని కథినంగా...
 
19) ఒంటరిగా ఉండాలంటే భయం...
      అందుకే బాత్రూం సంగీతం ప్రతీ ఇంట్లో...
 
20) వృధాప్రయాస ఏకాంతానికై...
      మళ్ళీ,మళ్ళీ ప్రతిధ్వనించే నీ జ్ఞాపకాలతో...
 
21) గొప్పోడని తెలిసేది నోట్ల
      లెక్కతో కాదు... ఓదార్చే చేతుల లెక్కతో...
 
22) సరిగమలు తెలియకున్నా...
      ఆలుమగలు విద్వాంసులే... అను'రాగం'లో...
 
23) పరులకోసం నటించకు...
      నీ పాత్రనెవ్వరూ పోషించలేరు... నువ్వుతప్ప...
 
24) హృదయనివేదన కళ్ళతో
       తక్కువచూడు లోకాన్ని.. నొప్పెక్కువవుతోంది!!!
       కళ్ళ ప్రతిస్పందన...
       హృదయమా ఎక్కువగా స్పందించకు
       ఏడ్వలేక చస్తున్నా!!!
 
25) రెక్కలొచ్చిన చిరుదోమ
      ఆశ్చర్యం... నేనొస్తుంటే ఈ చప్పట్లెందుకో???
 
26) ఒకే పొరపాటు రెండుమార్లు
      చెయ్యకు..తప్పంటారు...కొత్తవి చాలా ఉన్నాయ్...
 
27) పధకాలన్నీ ప్రజలకేనట...
      ఆలికి చీరకొనడం ఊరికి ఉపకారం లా...
...ఊరికుపకారం లా???