స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Tuesday, 31 July 2012

ప్రశ్నప్రశ్నలు ఎన్నెన్నో మనిషి మస్తిష్కంలో
ప్రతిక్షణం, ప్రతీదినం..అడుగడుగునా
ప్రతీరోజు మారే తేదీ, ఆరోజు పరీక్ష కోసం
హాల్ టికట్ నెంబర్ లా కనిపిస్తుంది.
క్యాలెండర్ వైకుంఠపాళిలా కనిపిస్తుంటుంది.

కొన్ని ప్రశ్నలు తటాలున పుడతాయి
వాటి సమాధానాలు అంతే వేగంగా తడతాయి
ఆకాశంలో మెరుపు మెరిసినట్లు
సముద్రం లో అల ఎగిసినట్లు

కొన్ని ప్రశ్నలు గొంతు దాటేందుకు సంశయిస్తాయి
వాటి సమాధానాలకు రూపముండదు, ఊహలు తప్ప
ఇవి వేదిస్తాయి...అప్పుడప్పుడు బాధిస్తాయి
ఆకాశం ఎత్తు కొలిచినట్లు
సముద్రం లోతు తెలుసుకున్నట్లు

కొన్ని ప్రశ్నలు సూటిగా ఉంటాయి
చెప్పాలంటే సూదిగా ఉంటాయి
అవి తిన్నగా మనసు పొరలను తాకుతాయి
వీటి సమాధానం కోసం మేధోమదనం జరగాలి
వీటికి సమాధానం చిక్కేది ఆలోచనా శక్తిమీదే
అవి తాకే గాలిలా కనిపించకున్నా కదిలిస్తుంటాయి

కొన్ని ప్రశ్నలు అంతరంగ అంతర్జాలంలో
కొన్ని ప్రశ్నలు బాహ్యవ్యక్తుల వ్యాఖ్యానంలో
కొన్ని ప్రశ్నలు పసిపిల్లల అమాయకత్వంలో
కొన్నిప్రశ్నలు కనిపించే,వినిపించే ప్రకృతిలో
ఇలా ఎన్నెన్నో...వెంటాడుతూనే ఉంటాయి
మనిషి జీవనయాత్రలో, మరణశయ్య చేరేవరకు

ప్రశ్నలతోనే మనిషి పరిణితి, ప్రగతి
ప్రశ్నలే లేవంటే... చలనమున్నా జీవం లేనట్లే

పెళ్లి-గజల్

పెళ్ళీనాటి జ్ఞాపకాల మల్లెలు, దాచుకో ఒక్కొక్కటే!
అందమైన అనుభవాల మువ్వలు, కూర్చుకో ఒక్కొక్కటే!!

ఊగే జుంకాలతో, విసిరే అరనవ్వుతో.. కళ్ళుచేసే బాసలెన్నో
పెళ్ళిచూపుల నాటి మాటలు, పంచుకో ఒక్కొక్కటే!!

ఆశీర్వచనాలతో, ఆనందపు నీళ్ళతో, కన్నవారి కళ్ళ కాంతులెన్నో
మార్చుకున్న తాంబూల గంధాలు, ఎద రాసుకో ఒక్కొక్కటే!!

తెరచాటు మాటున అరచేతులు ఉంచిన, అక్షింతల జల్లులెన్నో
మంత్రాలు ముడివేసిన ఘడియలు, తలుచుకో ఒక్కొక్కటే!!

అరమోడ్పు కన్నుల బిడియాల మాటలు, పూల మాటు గుస,గుసలెన్నో
పంచుకున్న తమలపాకు చిలకలు, నెమరేసుకో ఒక్కొక్కటే!!

ఆరుపదులు దాటినా కోదండ, ఆరని సుగంధమేలే ఈ ప్రేమ
మనసులు శృతిచేసుకున్న గీతాలు, పాడుకో ఒక్కొక్కటే!!

అనుభవ రాహిత్యం

ఒక సాయంత్రం,ఒంటరిగా కోనేటిపక్కన కూర్చున్నాను,
వేడెక్కిన మెదడుతో,బరువెక్కిన గుండెతో,
సమాజం పోకడపై అసహనం తో.. ఆగ్రహంతో
...
విసుగెత్తిన మనసుకి,నులువెచ్చని కౌగిలి ఇస్తూ
పచ్చికబైళ్ళు మెత్తలుగా పరుచుకున్నాయ్.
కల్మాషాల కుళ్ళుని చూసి కలతచెందిన నాకళ్ళు,
నీలాకాశంలో మేఘాలను నగ్నంగా చూసి మురిసిపోతున్నాయి.
అరుపుల తొక్కిసలాటలో నలిగిపోయిన నా చెవులు,
అలల సంగీతాన్ని,అరేబియన్ గీతంలా ఆశ్వాదిస్తున్నాయ్.

వలపు కోనేరు పొలాన్ని,సంధ్యాకిరణాలు దున్నేస్తున్నాయ్.
రెండుపక్కల నిటారుగా నిలిచున్న మావిడిచెట్లు,
ఆతిధ్యం స్వీకరించమని ఆహ్వానం పంపుతున్నాయ్.
అప్పుడప్పుడు,ఎంగిలిపడే కొంగల ముక్కులపై
తాకిన కిరణాలు ముక్కెరలై మెరుస్తున్నాయ్.
కరిగిపోతున్న కాలాన్ని చుక్క,చుక్కగా
ఆశ్వాదిస్తూ.. గుటకలేస్తూ గడిపేసాను.

అప్పటిదాక మిన్నకుండిన నా మనసు
ఒంటరిగా ఉన్నావంటూ,తుంటరిగా సైగచేసింది.
ఆలోచనలు,అస్తమించడం ప్రారంభం అయ్యాయ్.
కాసేపటికి ఏదో విసుగు నాలో, పరిగెత్తడం ఆరంభించింది.
వెంటనే అడుగులు,అనుమతి అడగకుండానే
అంగలువెయ్యడం మొదలెట్టాయ్...
జనప్రవాహంలో తరగలెత్తక తప్పదులే అంటూ

అప్పటిదాక ఆనందించిన నా మనసే
కాసేపటికి తిరిగి ఉపదేశించింది నన్ను హెచ్చరిస్తూ...
అందంగా ఉందని,ఆహ్లాదం పంచిచ్చిందని
కోనేట్లో కాపురం ఉండలేం కదా అని,
ఎప్పుడైనా జరుపుకునేది మాత్రమే పండుగ అని,
వానప్రస్థం స్వీకరించాల్సింది వార్ధక్యంలోనేనని

కాలికి బురద అంటిందని, నరికేస్తామా???
కడిగేస్తాం...కుదరకపోతే కనీసం తుడిచేస్తాం.
కుళ్ళిపోతున్న సమాజాన్ని సంస్కరించు,
నీ వల్ల కాకపోతే పక్కకు జరిగి నమస్కరించు,
అంతేకాని సమాజాన్ని బహిష్కరిస్తే ఎలా???
నీ అనుభవరాహిత్యం కాకపోతే అంటూ గీత ముగించింది.
అప్పుడే తెలిసింది ప్రకృతి అందాలు,నిశ్శబ్ద సమయాలు
అలసినప్పుడు సేదదీరడానికి మాత్రమే అని!!!

రాశి

మెరుపు మెరిసినంత మాత్రాన
వానచినుకు రాలదు
నిబ్బరంగా నిలబడ్డ
మేఘగర్బం మెలితిరిగితే తప్ప,

తలగోక్కున్నంత మాత్రాన
ఆలోచన తట్టదు
సమయస్పూర్తి, సంపూర్ణ ఆర్తితో
మేధకు పదునుపెడితే తప్ప,

నాట్లు వేసినంత మాత్రాన
పైరు ఏపుగా పెరగదు
కలుపు తీస్తూ, ఎరువులేస్తూ
పుడమితల్లిని లాలిస్తే తప్ప,

మీట నొక్కినంత మాత్రాన
వాహనం నడవదు
నిదానంగా, నిలకడగా
నియంత్రణతో నడిపితే తప్ప,

కలం పట్టినంత మాత్రాన
మంచికవిత జనియించదు
ఆవులిస్తున్న కలం ఒళ్ళువిదిల్చి
మనసుతో లోకాన్ని చూస్తే తప్ప,

రాసినదంతా రాశిగా పొయ్యి,
జల్లెడ కుదుపుకి ఆగినదిమాత్రమే జనానికి ఇయ్యి

Thursday, 12 July 2012

చీకటి

ఇప్పటి చీకటికెన్నెన్ని రూపాలో తెలుసా?
అది తొండముదిరి ఊసరవెల్లిగా మారింది.
పగలంతా ఎక్కడో గుహలో దాక్కొని,
ఏ చిన్నదీపం చూసినా వెన్నుచూపే
పాతకాలపు చీకటి కాదిది.
దశావతారాలే ఆ మహావిష్ణువుకి,
అనంతావతారాలు ఈ పెంజీకటికి.

ఫైళ్ల మీద సంతకానికై వేళ్ళసందుల్లో
లంచాక్షరాలుగా రాలుతుంది.
రేషన్ షాపుల బట్వాడాలో ప్రతీగింజలోనూ,
అరగింజకు నల్లరంగు పూస్తుంది.
పార్టీ కోటాలో తన వాటా పెంచేందుకు
కులం అంటూ గళం లేపి నిరాహార డేరాలేస్తుంది.
విశ్వాసపు రంగు వెలిసిపోతే
మతం మత్తు చల్లి ఎర్రరంగుని పూసేస్తుంది.

వెలుగులో ఈ చీకటి ప్రదర్శించే నాటకాలే
శంఖుస్థాపన దాటని సంక్షేమ ప్రాజెక్టులు
దొంగని,గంగిగోవని ఒప్పించే పత్రికా వ్యాసంగాలు
పదవుల బేరం కుదరక కప్పగెంతులు వేస్తుంటుంది

ఈ చీకటి తరిమెయ్యాలంటే
చిన్న,చిన్న దీపాలుగా వెలిగితే లాభం లేదోయ్
మెరుపై ఒక్కసారి మెరిసినా ప్రభావం రాదోయ్
ఉవ్వెత్తునలేచే జ్వాలగా మారిపో
ఈ చీకటిని సమూలంగా కాల్చిపో

Tuesday, 10 July 2012

పరస్పర వైరుద్యం

నింగినెగిరే గువ్వల్ని చూస్తే
నేలపైనున్న మనకనిపిస్తుంది
అవి అందానికి ప్రతిబింబాలని
కాని దాని రెక్కల కింద ఉన్న
పచ్చిగాయాలు కానరావు.

నేలలో పాతుకుపోయిన
రాతి శిల్పాలని చూస్తే మనకనిపిస్తుంది
అవి ఆకర్షణకి, ప్రత్యక్ష తార్కాణాలని
కాని వాటి చర్మం చెక్కిన
వేనవేల ఉలిదెబ్బలు కనిపించవు.

సాయంత్రం చల్లగా తాకే
పిల్లగాలిని చూస్తే మనకనిపిస్తుంది
హాయికి మరోపేరు సంద్యాసమీరేనని
కాని కాసేపు విశ్రమించే యోగం లేని
నిరంతర కారాగారవాసులవి.

నిశ్శబ్దాన్ని ధరించిన రాత్రి
ద్వనితరంగం దరిచేరితే శబ్దాన్ని వరిస్తుంది
నిదురపుచ్చే నిశ్శబ్దం చూస్తే మనసు పరవశిస్తుంది
శబ్దం లయబద్దమయితే కర్ణం స్వరవశిస్తుంది

సృష్టి మొత్తంకలిగివుంది పరస్పరవైరుద్యం
ఎన్నో అపసృతులు,మరెన్నో ద్వంద్వ ప్రవృత్తులు ఉన్నాయి
అయినా భూమి తిరుగుతూనే ఉంది
సమదృష్టితో సమన్వయించుకుంటూ

Sunday, 8 July 2012

పురోగమనం

మనిషి జీవితం అంటే
సమస్యల సంపుటే అనుకుంటా!!!
ఎప్పుడూ ఏదో ఒక సమస్య
ఒకదానికి పరిష్కారం వెదికే లోగా
ఇంకొకటి.. రావణుడి తలకాయల్లా

ఊహించని మలుపులెన్నో
ప్రతీ మలుపులోని ప్రశ్నించుకుంటాను
నా జీవితం సూటిగా సాగదెందుకని???
ప్రశ్నించేవరకే... జవాబు ఏమిటో
వినే సమయం కూడా లేదు.

వాతావరణం బాగాలేదని ప్రయాణం మానూంటామా?
అది అనివార్యమైతే...
జారుడుమెట్లని ఎక్కడం మానుకుంటామా?
అది అవసరం అయితే...
అలా కాకపోతే అది పరాజయం అవుతుంది.

అప్పుడప్పుడు కొన్ని,కొన్ని సమస్యలు
రొద పెడతాయ్.. సర్దుబాటు చేసుకోమని తప్పదుగా
కానీ ప్రతీ సమస్యకి సర్దుబాటంటే అది
సర్దుబాటు కాదు, లొంగుబాటే అవుతుంది.
జాగృతి చెందాల్సినప్పుడు
జోలపాటలు వింటే
వచ్చేది మగతేకాని..ప్రగతి కాదు.

నీరు పరిగెత్తకపోతే ఊతమిచ్చే
రాతికి కూడా నాచుపడుతుంది.
అందుకే బతుకుబండి ఎప్పుడూ
ఏకదిశనే కలిగి ఉండాలి
అది పురోగమనమే అయివుండాలి.

Saturday, 7 July 2012

డబ్బుచేసింది

అప్పుడెప్పుడో నువ్వు బాగా బతికినప్పుడు
నీ జబ్బల్లో సత్తువున్నప్పుడు
నీ మనసు నిబ్బరం తో ఉన్నప్పుడు
నీ ఒళ్ళో కూచొని వాడు ఎంగిలి పడేటోడు
నీ భుజాలమీద సవారి చేసేటోడు

అప్పుడెప్పుడో నువ్వు సైకిల్ తొక్కేటప్పుడు
నీ గుండెలో ఆశలున్నప్పుడు
నీ రక్తానికి వేగమున్నప్పుడు
నీ ఎనక గూర్చొని బడికెళ్ళేటోడు
నీ చెమట కొన్న గుడ్డ తొడిగేటోడు

అప్పుడెప్పుడో నువ్వు అప్పుల్జేసినప్పుడు
నీ మీసం మెరిసినప్పుడు
నీ కంటిచూపు తగ్గినప్పుడు
నీ టాటా తో ఇమానం ఎక్కినోడు
నీ ఆశతో దొరలసెంత జేరినోడు

ఇప్పుడు..

నువ్వు బోర్లా పడ్డప్పుడు
నీ ఇంటిది కాటికి సేరినప్పుడు
నీ కంటనీరు ఇంకినప్పుడు
నీ పిలుపుకి అందకుండా.. దూరం లో వాడు
నీ గుండెబరువు తలకెక్కనంత భోగం లో వాడే

ఏం జేస్తాం లే అయ్యా!!!
ఆడికి డబ్బుజేసింది
ఈ రోగమొస్తే మతిమరుపు పెరుగుద్ది
గోరుముద్ద,గుర్రమాట మర్సిపోయే
ఆడికన్నమెట్టి నువ్వు జేసిన పస్తులు మర్సిపోయే
నువ్వు చేసిన అప్పులు మర్సిపోయే
నువ్వు పంచిచ్చిన రక్తమే మరిసిపోయే

ఇప్పుడు ఇంటిదానికి తలకొరివి నువ్వే బెట్టాలా
ఈలుంటే నీ సితికి నువ్వే కర్రలు సమకూర్సుకోవాల
ఆడికి డబ్బుజేసింది మరి