స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Saturday, 22 December 2012

గుప్పెడు మల్లెలు-23

1.
చావు,పుట్టుకల మద్య
ఎడం,
పెరగడం
2.
విజ్ఞానం ఎంత పెరిగినా,
బాధకి కొలమానం
దొరికేనా???
3.
నచ్చినోడి తప్పు,
తప్పనిపించదు.
కోపం మనకే,మనసుకి కాదు.
4.
మృత్యుసవ్వడి వింటూనేవున్నాం,
సాగిపో...
అవసానం ఆ ఒడ్డునవుంది.
5.
ఆకలిదోచే దొంగేలేడు,
ఆక్రందనల సంగీతం
ఆగిపోతుందనేమో???
6.
పోట్లాడేముందు మట్లాడు,
ఎడారి రొమ్మునకూడా
జలాశయం ఉంటుంది.
7.
కళ్ళది అనుభవం,
గుండెది అనుభూతి,
నిర్ణయం గుండెకొదిలెయ్.
8.
అక్షరాకులు పరిచా,
ఆశ్చర్యం...
భావకుటీరం వెలిసింది.
9.
మురికివాడేనని
చూపు తిప్పుకోకు,
స్వాభిమానం దాగుందక్కడ
10.
చెప్పేది పూర్తిగా విను,
నోరు ఒకటే,చెవులు రెండు
నిష్పత్తి ప్రకారం...
================================
తేదీ: 22.12.2012

Thursday, 13 December 2012

గుప్పెడు మల్లెలు-22

1.
తప్పురాసింది పెన్నైతే,
కాగితాన్ని చింపేస్తాం.
కిందుంటే లోకువే
2.
చేవున్న లవంగం నిజం,
నోట్లోవేస్తే
చురుక్కుమంటుంది.
3.
ఫైళ్ళమీద సంతకానికి,
వేళ్ళమద్య
లంచాక్షరాలు
4.
నిరుద్యోగ సంఘం
బలవంతపుబహిష్కరణ,
రోడ్డుపక్క సేల్స్ మాన్
5.
ప్రశ్నలముళ్ళు లేవంటే,
తప్పుదారిలో ఉన్నట్టు.
ప్రశ్నలు గమ్యానికి ఆనవాలు.
6.
చూపులు ఒక అయస్కాంతం,
విసిరేయ్
అందమైన దృశ్యాలొస్తాయ్
7.
ఆత్మభ్రమణం తప్పుకాదు,
కానీ... వెలుగుకోసం
పరిభ్రమణం తప్పదు.
8.
'బిజీ' అని జవాబొస్తే,
నీకు ప్రాముఖ్యం లేనట్లు,
ప్రతీరోజుకీ 24 గంటలే.
9.
ఐకమత్యానికి అర్ధం వెతక్కు,
అనుమానమొస్తే
నీ పాదాలనడుగు.
10.
చరిత్ర చిటికెలో తయారుకాదు.
కొట్టిపారెయ్యకు
అది సంఘర్షణల సమాహారం.
=======================================
తేది:12/12/12

Wednesday, 12 December 2012

మలుపు

అక్షరాలు పిలుస్తున్నాయ్,
పుస్తకాలు మూసేసినా.

అనుభవాలు పరికిస్తున్నాయ్,
నవ్యలోకా నడుగేసినా.

ప్రశ్నలెన్నో మొలకెత్తుతున్నాయ్,
పాతదారినే నడిచినా.

జ్ఞాపకాలు వెంటాడుతున్నాయ్,
కాలచక్రం తిరిగినా.

మలుపులన్నవి సహజమేమో,
జీవితం ఎంత గడిచినా.
==================================
తేదీ: 06.12.12

తెలుగు భాష


పల్లవి:
పాడేనా తెలుగుపాటే పాడాలి
పండేనా తెలుగుచేనే పండాలి
          తెలుగుని తాకుతూ పైరగాలి
          నేలకి నలుమూలల తిరగాలి

చరణం:
నన్నయ్య,తిక్కన్న మనపూర్వికులే,
అన్నమయ్య,గోపన్న తేనెపంచెలె,
          ఘనమైన పూర్వచరిత మనకున్నదిలే
          పరభాషా కోవిదులే శ్లాఘించెనులే
పాలకడలి వరదించిన యజ్ఞఫలమిదే,
నేలకొరిగి పారనీకు, అమృతమిదిలే

చరణం:
కృష్ణశాస్త్రి సాహిత్యం మనసంపదలే,
శ్రీశ్రీ విప్లవశంఖం నవచేతనలే,
         జ్ఞానపీఠం ఎక్కినాడు జనసినారె,
         గూడపాటి చెక్కినాడు మనసుతీరే,
వినయంతో మనచరిత్ర నువ్వుచదువుకో, 
విజ్ఞతతో ఆ చరిత్ర తిరగరాసుకో

చరణం:
కాలంతో మార్పన్నది అతిసహజములే,
పాశ్చాత్యం, పరిణితికి ప్రగతిపధములే
         పరభాషా ప్రావీణ్యం ఆభరణములే
         మనభాష ప్రాచుర్యం ఆచరణములే
అమ్మలాంటి తెలుగుభాష అమృతవీణ, 
జన్మంతా కొలుచుకున్న ఋణం తీరునా!!!
============================
తేదీ: 09.12.12; 03;12