స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Saturday, 29 June 2013

//కనిపిస్తే//

కష్టాలు మానులకు కాదు, మనుషులకే అని ఎంతోమంది చెబుతున్నా... ఆ కష్టాలని ఓర్చుకునే శక్తి కూడా కొంతవరకే. పదే,పదే పరీక్షిస్తే బండ రాయైనా, బతుకుబండిలాగే మనిషైనా బ్రద్దలవ్వక తప్పదుగా. అలాంటి మనుషులు అయితే వ్యసనాలకి, లేదా సన్యాసానికి... మరీ నీరసపడితే ఆత్మహత్యలకి చేరువవుతారు. మత్తులో ఉన్నవాడు ఆ బాధలకి మొదటగా విమర్శించేది ఆ దేవుడినే, అలాంటి ఒక వ్యక్తి ఆ దేవుడిని ఇలా ప్రశ్నిస్తున్నడు....

పల్లవి:
----------
కనిపిస్తే నిను నిలదీస్తామని,
వినిపిస్తే నిను కదిలిస్తామని,
శిలవైనావా సామీ...
నీ మనసులో ఉన్నది ఏమీ...
నువు బదులే చెప్పరా సామీ...

చరణం:
----------
పాలతోటి తానాలు సేసి, నువు పట్టుబట్టలే కట్టి,
ఆలితోటి ఆ గోపురాన, నువు కాపురాన్నే పెట్టి,
పండగలొసే పల్లకిలోన ఊరేగే ఓ సామీ...(2)
మా ఆకలి కేకలు, ఊరేగింపులో ఇనపడకున్నాయా?
మా చిరిగిన బతుకులు, ఎలగని దివ్వెలు అగుపడకున్నాయా?
నీకు అగుపడకున్నాయా........... //కనిపిస్తే//

చరణం:
---------
దూపమేసి గంధాలు పూసి, నీకు మాలలెన్నో సుట్టి,
లాలిపాటతో ఊయలూపి, నిను నిద్దురలోనే పెట్టి,
దోపిడి సేసి, దచ్చినలిచ్చే దొరలమద్యలో సామీ...(2)
మా తడిసిన కన్నులు, ఇడిసే నీరుకి మురిసే పోయావా?
మా మడుసుల జాడని, గుడిసెల దారిని మరిసే పోయావా?
నువ్వు మరిసే పోయావా..........//కనిపిస్తే//
======================================
29.06.2013

Friday, 28 June 2013

గుప్పెడు మల్లెలు-33

1.
వెక్కిరింతంత బాగా,
కౌగిలింత నేర్వలే...
మాయలోకం.
2.
పెరిగేకొద్దీ,తరిగిపోద్ది
దాక్కునే జాగా
ముళ్ల కీర్తి కిరీటం.
3.
మన బెస్టిచ్చినా,
ఒక్కోసారి
మనం బెస్టు కాపోవచ్చు.
4.
కళ్లగంతలే
దుఃఖానికీ
సుఖానికీ
5.
ఇంటికొక్కడు చొప్పున,
రాముడొదిలేసిన,
రావణ సైన్యం.
6.
నిదురించే సింహం...
ఎవడి గురించి,
వాడనుకునేది.
7.
ముక్కు చెక్కితే బాణం,
మద్య పొడిస్తే గానం,
వెదురు బహుచిత్రం
8.
రెండే దిక్కులు.
ఉత్తరం,దక్షిణం
ఉద్యోగానికి
9.
బాధించేవన్నీ
చెడ్డవికావు.
నాన్న కొట్టిన దెబ్బల్లా
10.
తెల్లోడొదిలెల్లిన మచ్చలు...
సారి, థాంక్స్...
తప్పుకైనా,మెప్పుకైనా
===========================
తేదీ: 25.06.2013

ప్రకృతి-వికృతి

గబ్బిలంలా ఆకాశాన్ని
అతుక్కున్న మేఘం,
వర్షం రూపంలో
విషం కక్కుతోంది.

తన పిల్లల్ని తనే తినే,
పెద్ద పులిలా...
ఉత్తరాన ఎత్తుగావున్న కొండచెరియ,
ఊడిపడి విద్వంశం సృష్టిస్తోంది.

కీటకాన్ని చప్పరించే
రాకాసి బల్లిలా...
సాయానికెళ్లిన హెలికాప్టర్ని,
ఈదురుగాలి కూలుస్తోంది.

కోడిపెట్టని ఎత్తుకెళ్లే గుంటనక్కలా,
మందాకిని, మందిని ముంచేస్తోంది.
శివాలయం మొత్తం
శవాల కంపుతో నిండిపోయింది.

ఎవడంటున్నాడు ఇంకా ఇక్కడ,
ప్రకృతి అందమైనదని...
ఇన్ని వికృతి చేష్టలు చూసాక కూడా...
======================
Date: 28.06.2013

Saturday, 22 June 2013

ప్రయాణం

ఇదొక ప్రయాణం,
రహదారిలా కనిపిస్తుంది,
ఎడారిలా ఎదురవుతుంది.
ఎంత లోతుకెళ్ళినా ఒక్కోసారి,
చమురుచుక్కైనా చెమరించదు.

ఇదొక ప్రయాణం,
రోడ్డుమీద,నడ్డివిరుస్తూ నడవాలనిపిస్తుంది,
అంతలోనే అడ్డదారి సందుల్లో కాలు నడుస్తుంది.
మందలో ముందుకు పోయే ముఖాన్ని,
ఎవరు గుర్తు పడతారులే అనుకుని,

ఇదొక ప్రయాణం,
ఒక సుదీర్ఘ వాక్యం. 
పాడెక్కినప్పుడే ఫులుస్టాప్,
వాక్యం పూర్తి చెయ్యాలనుంటుంది.
కామా మంచం మీద 
కునికిపాట్లు పడుతుంటుంది.

ఇదొక ప్రయాణం,
జారిపడని కాలుంటుందా???
గాయపడని గుండె ఉంటుందా???
రంకెలేసి గర్జించాలని ఉంటుంది.
సంకెలేసిన గొంతు సకిలింతలతో సరిపెడుతుంది.

కానీ... ఇదొక ప్రయాణం,
ప్రయోగం చేస్తేనే ప్రకాశం,
ప్రయత్నిస్తేనే వికాశం,
మంచుపొగలా మూల్గుతావెందుకు అనుదినం, 
మండే నిప్పులా గుప్పుమనాలి కనీసం ఒక్క క్షణం.
===============================
22.09.2012

Friday, 21 June 2013

చూసిందే లోకమంటే ఎలా???

1.
అది ఒక పల్లె,
కొందరికే ఆలయ ప్రవేశం,
కొందరిదే రచ్చబండ న్యాయస్థానం
కొందరిదే బడిలో చదువు,

మరికొందరు పెళ్ళికి డప్పుకొట్టాలి,
కాళ్ళకు తోలుసెప్పు కుట్టాలి,
సచ్చినోళ్ళకి పాడె కట్టాలి,
కాని ఊరు సివరే కుళ్ళి సావాలి.

అది పల్లె,
ఇక్కడ మానవత్వానికి కాలం చెల్లె

2.
అది ఒక పట్నం
సాధించింది అత్తెసరు మార్కులే
కారుల్లో షికార్లు,
గవర్నమెంటు నౌకరీలు,
అయినా ఇంకా... 
పిల్లల,పిల్లలకీ రిజర్వేషన్లు,

కొందరు మేధావులున్నారు
చేతిలో పట్టాకి ఖర్చు అమ్మ పుస్తెలు,
పస్తులుంటూ దరఖాస్తులు, 
అడుక్కోడానికి అడ్డొచ్చే అగ్రకులం,
ఆత్మహత్యకి గుర్తొచ్చే సంస్కారం,
బతికేస్తుంటారు.. చావుని వెతుక్కుంటూ

అది పట్నం,
తిరిగే రాట్నం

చూసిందే లోకమంటే ఎలా???
====================
01.08.2012

తృప్తి

అద్దం లో నన్ను,నేను చూసుకుంటూ
జాలిపడటం అలవాటైపోయింది.
గడిచిన పది రోజుల్లో ఇది ఆరోసారి 
నా మీద నేను జాలిపడటం

కళ్ళ కింద కాస్త నల్లబడ్డ,
చెంపలపై కాస్త తెల్లబడ్డ,
చర్మం అక్కడక్కడ ముడతలుబడ్డ,
మనిషిని బలంగానే ఉన్నానే!

అయినా పక్కింటి అమ్మాయి పలకరించిన
ప్రతీసారీ "అంకుల్,అక్క ఉందా?"
అని అడుగుతుంది ఎందుకో???
అది విని నా మనసేడుస్తుంది ఎందుకో???
ఎన్ని క్రీములు రాసినా,ఎంత పౌడర్ పూసినా
ఈ కళ్ళ కింద నలుపు పోదెందుకో???
అబద్దం ఆడుతోంది అద్దమా???అమ్మాయా???

అబద్దం ఆడుతోంది అమ్మాయే...
లేకపోతే వాళ్ళమ్మాయి నాతో
"నేను నీకు అమ్మనంట!!!
నీకు అన్నం పెడతానంట"
అంటూ నా అరచేతిని ఆకునిచేసి
ఉత్తుత్తి భోజనం పెడుతుందా???
ఇప్పుడు తృప్తిగా ఉంది
ఫేషన్ షోలో పాల్గొన్నంత తృప్తిగా
==================
Date: 11-07-2012

సౌండుకి షేపొస్తే

బందువల్ల అంతగా పనిలేదేమో,
వింత ఆలోచనొకటొచ్చింది నాకు.
సౌండుకి షేపొస్తే ఎలాగుంటుందోనని,
లేడికి లేచిందే పరుగన్నట్లు,
అనిపించిందే తడవు కళ్లు మూసేసా,
చెవులతో చూద్దామని,
నా నడక సాగుతుంటే, 
చెవులు సౌండుని వేటాడుతున్నాయ్.

శ్రీరంగ,రంగ,రంగ అంటూ
పారవశ్యం పొందే సౌండు,
రాంగు నెంబర్ రవణమ్మ అంటూ
పడుచుదనం పరుగులెత్తే సౌండు,
రింగ,రింగ,రింగ,రింగ అంటూ
గంగవెర్రులెత్తే సౌండు,
రింగా,రింగా రోజెస్ అంటూ
పసిదనం పారాడే సౌండు,
ఇవన్నీ రంగు,రంగుల డ్రెస్సుల్లో
చెవులముందు డాన్సు కడతన్నాయ్.

ఇంకొన్ని ఫ్లూటుగా, చల్లగా,
మరికొన్ని ఫాస్టుబీటుగా,ఘాటుగా,
పలకరిస్తున్నాయ్, చుట్టూరా తిరుగుతూ,
ఇంతలో మరో పెద్ద సౌండు,
ఎగిరిమీదకి దూకిన పులిలా,

కర్ణభేరి పగిలినట్టు అనిపించింది.
భయంతో చెవులుమూసి,కళ్లు తెరిచాను.
సైకిల్ టైరు పంక్చర్ అయిన సౌండు.
భయంతో జడుసుకు చచ్చాను,
భయంతగ్గినా, దడ తగ్గలేదు.

అందుకే గాడిదపని గాడిద,
కుక్కపని కుక్కే చెయాలి అని,
ఎందుకంటారో తెలిసింది.
వైపరీత్యం చొరబడితే,
మిగిలేది వైకల్యమే,
అది పంచేంద్రియమైనా,
ప్రపంచాన్నేలే ప్రేమైనా....
==========================
తేదీ: 21.02.201

నిరాశ నుంచి ఆశ

నిర్విరామంగా చలిస్తూ
చరా,చర సృష్టిని మోస్తూ
క్షమ,సహనాలకి మారురూపుగా
లోకాన్ని లాలించే ధరిత్రి
అప్పుడప్పుడు ఆగ్రహిస్తుంది.
ఆ ప్రకంపనాలు సమగ్ర జీవకోటిని
కలవర పరుస్తుంది,నిలువెల్లా కూల్చేస్తుంది.

లోకమంతా,తన శాఖలతో నింపివేసి
చల్లగాలి,పిల్లగాలిగా తాకే నేస్తం గాలి 
ఆశ్రయించిన ప్రాణికోటిని 
కౌగిలించుకుని ఆదరిస్తుంది.
హఠాత్తుగా కోపగిస్తుంది,
ప్రాణవాయువే విషపూరితమై 
విజృంబిస్తుంది, జీవం పీల్చేస్తుంది.

హరిత వర్ణం,నేలపై కళ్ళాపి చల్లే,
దప్పిక తీర్చి,అక్కున జేర్చుకునే
చిరుజల్లుల వర్షం చిరునవ్వులతో పలకరిస్తుంది.
జగమంతా నిండిన ఆనందం తో పులకిస్తుంది.
ఎప్పుడైనా ఆవేశం కల్గితే ఉప్పెనై ముంచేస్తుంది.

ఆకస్మికంగా ఎదురుపడే ఆప్తుల కోపాలెన్నో
ఖంగున మోగుతూ,నిశ్శబ్దం గా నిష్క్రమిస్తాయి.
విపత్తులు సంభవించాయని విచారం వ్యక్తం చేస్తే
కర్తవ్య విముఖునివైతే మనుగడ ఎలా???
తుళ్ళే కెరటం పై దూకితేనే తీరం చేరేది.
నైరాశ్యం నుంచి ఆశను చేదుకున్నప్పుడే విజయం సిద్ధించేది
================================
Date:26.07.2012

ఆనందం

సృష్టిలో నిర్వచనాల్లేని పదాలున్నాయ్,
కొలమానం లేని ప్రమాణాలున్నాయ్,
అవధుల్లేని అనుభూతులున్నాయ్,
అందులోని ఆనందం ఒకటి.

ఎవడిపిచ్చి వాడికానందం,
అన్నాడొక మహా పిచ్చోడు.
కాని అది పరమ సత్యం.
నిజంగా ఎవడి ఆనందానికి వాడే కర్త.

మునిపంటితో గాటు చేస్తూ,
చనుబాలుని తాగుతుంటే,తల్లి పడే ఆనందం.
తప్పటడుగులేస్తూ తానొస్తుంటే,
వినిపించే చప్పెట్లమోతకి,బిడ్డపడే ఆనందం.
చెమటోడ్చి పెంచిన కొడుకు,
తోడొచ్చి కాసేటప్పుడు,రెక్కలొంగిన తండ్రి పడే ఆనందం.
మనసిచ్చిన లలనామణి,
మురిపిస్తూ చెంతచేరితే,ఆ ప్రియుడి ఆనందం.
పుట్టినరోజుకి,పట్టుచీరతో
అభినందిస్తే,భార్యపడే ఆనందం.

అలుపులేని శోధనతో,
అంతుచిక్కని రహస్యమేదో భేదించిన,శాస్త్రవేత్త ఆనందం.
ఏడాది కష్టం,ఏపుగా పెరిగి,
గాలికి తలలూపుతుంటే,రైతుపడే ఆనందం.
కలెక్టరైన కుర్రోడు,కాళ్ళకు దండంపెట్టి
మీ ఓనమాల భిక్షే అంటే,మాస్టారి ఆనందం.

ఎన్నో ఆనందాలు,ఎన్నెన్నో ఆనందాలు...
ఆనందానికి కొలమానం మరో ఆనందమే.
==========================
Date:14/10/2012

గుప్పెడు మల్లెలు-32

1.
ఇంకొన్నాళ్ళో... 
నువ్వొకగుడిలా...
నేనొకమసీదులా.
2.
చెడగొట్టేదే లేదు.
అన్నీ మేసేగాడిదలే... 
రాజకీయంలో
3.
పుకార్లంటే ఇవేనేమో...
స్వతంత్రానికి
అరవయ్యేళ్ళంట!!!
4.
ఐదేళ్ళపరిపాలనతో,
పాతికేళ్ళ
తిరోగమనం
5.
స్వాతంత్ర్యమా
నీ ఉనికెక్కడ?
ఆగష్టు 15న మాత్రమే
6.
తరాలుమారినా...
ఈశ్వరల్లా
స్వరాలు మారలేదు.
7.
అతిగాఆశపడకు...
ఏ పార్టీ అయినా
ఇండియావాళ్ళే
8.
గాంధిబొమ్మచూస్తేనే...
ప్రభుత్వోధ్యోగి పనిచేసేది.
దేశభక్తి
9.
చారిటీట్రస్ట్ లో చారిటీ...
బందరులడ్డూలో
బందరులాగే
10.
విభజించు-పాలించు
దేవుడేనేర్పాడేమో?
ఇన్నికులాలతో
==============
Date: 15.06.2013

ఏమో?

వడదెబ్బకి,దడపుట్టి పగుళ్లొచ్చిన నేల,
తొలకరి చినుకుల సాంగత్యంతో,
ఆకుపచ్చ కోక,ఆరుబయట ఆరేసింది.

అడుగంటా నీరింకి, శల్యమై,
డొక్కనిండా,పక్కటెముకలు తేలి,
దిక్కులు చూసే ఏరు,
ఆకాశపు ఆశీస్సుల అక్షింతలతో,
సర్రునలేచి జలతాండవం చేస్తోంది.

పండుటాకులు, పక్కనేవున్న ఎండుటాకులు,
దుడుకుగాలి,దూకుడుతో రాలిపోతే,
నగ్నంగా నిలబడ్డ తరుశాఖ,
వసంతం,ప్రశాంతంగా పలకరిస్తే,
పచ్చ జెండా ఎగరేస్తోంది.

బెణికిన కాలు.. కాస్త వనికించిన,
తర్వాత కాస్త విసిగించినా,
కాలమనే ఔషధాన్ని సేవిస్తూ,
క్రమ,క్రమంగా పునఃస్థితికి చేరుకుంది.

నేలపగులుకి, వానచినుకు,
ఏరు ఎండితే, జోరు వాన,
ఆకురాలితే, నవ్య వసంతం,
కాలు బెణికితే, కాల ఔషధం.
ఎక్కడికక్కడే,ఎప్పటికప్పుడే,
ప్రతీ ప్రశ్నకూ, సమాధానం.

మరి గుండె పగిలితే...
ఒక మనసు విరిగితే...
సమాధానం????????
ఒక జీసస్ నెత్తుటిచుక్కా?
ఒక మహాత్ముడి అమృతవాక్కా?
ఏమో?ఏమో??ఏమో???
===========================
Date:12.06.2013

Wednesday, 5 June 2013

గుప్పెడు మల్లెలు-31

1.
రాతిపలక మీద,
నీటి ఓనమాలు,
టీనేజీ ప్రేమలు
2.
పశుత్వాన్ని కూడా
క్షమించేస్తావ్.
పసితనం గుడ్డవాడు
3.
ఎదిగేమొక్క ముదిరిపోద్ది,
పెద్దోడయ్యే కొద్దీ,
పలకరింపు తగ్గిపోద్ది.
4.
దహించే అగ్నికికూడా,
గ్రహించే గుణముంటుంది.
ఓపికుండాలంతే....
5.
ఎలుగెత్తి పిలిస్తే,
గుహకూడా బదులిస్తుంది.
సిగ్గు ముడివిప్పేయ్.
6.
మసిలాగ,నిసిమూస్తే
మిణుగురు ఆగిపోద్దా,
స్వయంప్రకాశం ఉండాలంతే
7.
ఊరంతా
కాంక్రీటు అస్థిపంజరాలు.
గాడితప్పిన సూరీడు.
8.
బ్రహ్మరాతమీద,
ఉన్మాది పిచ్చిగీత,
ఉగ్రవాదం.
9.
అందరం కాలంవిత్తుకి
పుట్టిన మొక్కలం.
శిక్షణుంటే,వృక్షం అవుతాం.
10.
ఎంత నీరున్న కూరైనా,
ఉడికిస్తే ఇంకిపోతుంది.
పరుషవాక్యం పవర్ఫుల్.
=================
Date: 27.05.2013

అలక ఆడవారి జన్మహక్కు

నా చూపులు రోడ్డుని కొలుస్తున్నాయ్,
మా మేడ మీదనుంచే...
నిర్మానుష్యం,గ్రీష్మతాపం కదా.
ఇంతలో అవి ఎదురింటి డాబా
పిట్టగోడ మీదకెక్కాయ్.

పేరుకి తగ్గట్టు అది పిట్టగోడే,
అక్కడో పావురం మెడరిక్కించి,
ఆదిక్కు,ఈదిక్కూ చూస్తోంది.
ఆచూపులో నిరీక్షణ,నాచూపు తాకింది.
సహచరుడికై తహ,తహలాడుతున్నట్టుంది.
అప్పుడప్పుడు,బొంగరంలా
ఉన్నచోటే తిరుగుతోంది.
మెడని కరుచుకుంటోంది.
రెక్కలు దులుపుకుంటోంది.
అబ్బో.. నిరీక్షణకి
అసహనం ఎక్కువే అనుకున్నాను.

వేచిచూసిన సహచరుడు
తటాలున చేరుకున్నాడు.
ఆనందంతో ఉప్పొంగి,
అతిశయాన్ని ప్రకటించింది.
అంతలోనే అలక ఆరంభించింది.
కాస్త దూరంజరిగి పెడముఖం పెట్టింది.

సహచర పక్షికి దిక్కుతోచక,
ప్రదక్షిణలతో ప్రసన్నం చేసుకునేందుకు,
ప్రయత్నం మొదలెట్టింది.
అయినా అలక,ఒక కొలిక్కి రాలేదు.
బహుసా ఇదంతా అలవాటే కాబోలు,
విప్పారిన రెక్కలతో విన్నపాలు సమర్పించింది.
దానిముందు సాగిలపడింది.

ఇంకేముంది...అలక దూదిపింజ అయ్యింది.
జంటముక్కుల జాతర మొదలయ్యింది.
జోరు,జోరుగా హోరువానలా మారింది.
వెంటనే కింద గదిలోకి నా ప్రయాణం మొదలయ్యింది.
అవునులే...
నా ముందు చాలా ప్రపంచం,
మా ఇల్లాలికి నేనే ప్రపంచం.

అయినా
అలక ఆడవారి జన్మహక్కు.
అది తీర్చడంలో ఉన్న సుఖం,
అనుభవించాలే తప్ప...
అధిక్షేపించడానికి మనమెవ్వరం.
వాట్ డూయూ సే ...
మై డియర్ కె.కె.
===========================
Date:31.05.2013