స్వాగతం .....

"మానవతకు హారతి పట్టే మంచి మనుషులందరికీ స్వాగతం..."

Thursday, 19 December 2013

గుప్పెడు మల్లెలు-59

1.
ఈ పూట దగాపడ్డా,
రేపటికది పాఠమేలే,
పడ్డాక,లేవాల్సిందే
2.
గాలిలేని బంతి,
గోడక్కొడితే తిరిగొస్తుందా,
సరుకుంటేనే జరుగుబాటు
3.
దోమకుడుతుంటే చిరాకే,
కలత గుండె తొలుస్తుంటే,
మత్తునిద్రైనా కనుమరుగే
4.
బాధకన్నా బాధించేది,
భయం....
బాధలోవున్నామని గుర్తుచేస్తూ
5.
అనుకున్నదానికి,
అయినదానికి మద్యదూరం,
మనకోపం
6.
చెత్తబుట్ట ఎరుగని,
అచ్చుకాగితం,
ఒక్క కరెన్సీయే
7.
మసిబొగ్గు పులిమితేనే,
పాత్రకి మెరుగొస్తుంది,
తప్పెన్నువాడూ, తమ్ముడే
8.
ఫలిస్తుందా వృక్షం,
పచ్చని కొమ్మలు నరికేస్తే,
నిలుస్తుందా మానవత్వం,విలువలు నలిపేస్తే
9.
మెదడు పదునెక్కించే,
మాయా నవాబు,
మన ఖాళీజేబు
10.
అంతగొప్ప సూర్యుడే,
చీకటీపడీతే ఉండడే,
ఇంత మోజెందుకురా పదవంటే
=========================
Date: 19.12.2013

Tuesday, 17 December 2013

గుప్పెడు మల్లెలు-11

1.
తెలిసినట్టేవున్నా పరీక్షల్లో
రాయలేము సమాధానం,
ప్రేమ నిర్వచనంలా...
2.
మనసుకన్నా,
మేధకే పదునెక్కువ,
కదిలేది మాత్రం, మనసే
3.
జీవించడానికి,
మరణించడానికి తేడాలేదు,
ప్రేమలో ఉంటే...
4.
రసమయం ఈ జగత్తు,
రుస,రుసలాడినా పర్వాలేదు,
దేషమూ ప్రేమచెట్టు కొమ్మేలే
5.
సాగరమైనా ఆగుతుందేమో,
మనం ప్రయత్నిస్తే,
ఆపడం సాధ్యమా, మనసు ప్రేమిస్తే
6.
ప్రేమబాధకి విరుగుడేది?
ప్రేమలోపడ్డ పిచ్చోడా...
పెరుగుట విరుగుటకొరకే
7.
అద్దం ముందు నిల్చొని,
ఇద్దరం ఉన్నామంటే ఎలా?
ఎందరున్నా, మనసుభాష ఒక్కటే
8.
పువ్వులకి పొగరు,
అందంగా ఉంటాయని,
నిజానికి,అది నీ హృదయం
9.
వడగళ్లూ కాలుస్తాయ్,
అప్పుడప్పుడు...
ప్రియురాలి ఓరచూపులా
10.
కావాలంటే దొరకదు ఆనందం,
వెదుకూ...
అది అన్నింటా నిక్షిప్తం.
===============================

గుప్పెడు మల్లెలు-58

1.
పచ్చని చెట్టంటే,
పురుగు పంటికి దురదే,
రాజకీయమంటే... మరి అదే
2.
ముసిరే పొగమంచు,
ఫాను విసురుకి వీగదులే,
సంకల్పానికి సంకెళ్ళుండవ్
3.
నదులు కుమ్ముకొచ్చినా,
కడలి కౌగిలించదా,
అరిచాడని ఆప్తుడినొదిలెయ్యకు
4.
నిప్పుకణిక ఒక్కటైనా,
గడ్డికుప్ప కాలిపోదా,
దుర్మతిని దూరం పెట్టు
5.
సాగర గంభీరుడంట,
అయితే ప్రమాదమేనే...
పడవని ముంచేది కడలేరోయ్
6.
తడుస్తున్నా ఆడుతుంది నెమలి,
పరహితం కోరితే,
నిన్నాపదులే నీ ఆకలి
7.
పరదావెనక జరదాతిన్నా,
పళ్లమీద గార పడదా,
తప్పుదాగే జాగా తక్కువేలే
8.
అరిస్తేనో,తొడచరిస్తేనో,
వచ్చినట్టా కోపం? 
మౌనముని ఆగ్రహం మహాప్రళయం.
9.
పితికితే పాలిచ్చిందని,
పొడిస్తే నెత్తురురాదా,
దురాశ ముదిరితే దోపిడి కాదా
10.
ప్రశ్నలేవో మొలకెత్తుతాయ్,
పాతదారినే నడిచినా,
పరీక్షే ప్రతీదినం, జీవితం ఎంత గడిచినా
==========================
Date: 06.12.2013

గుప్పెడు మల్లెలు-57

1.
నిఖార్సైన అబద్ధం,
"ఇక్కడంతా క్షేమం,
అక్కడ క్షేమమని తలుస్తా"
2.
సంకర తెలుగు,
వంకర మాటలా...
డౌటేలేదు, అది యాంకరే
3.
నైరాశ్యం,
ఒక పాడుబడ్డ గొయ్యి,
పడ్డావో... చచ్చావే
4.
మడికట్టి గుడికెళ్లక్కర్లా,
తొడుక్కున్న వ్యక్తిత్వం,
తెల్లగావుంటే చాలు...ఉతుకు
5.
గతాన్ని రీలుగాచెయ్,
వీలుచూసి, రివీల్ చెయ్,
అనుభవం కంటే ఆప్తుడెవరు.
6.
రాసేప్పుడు నిశ్శబ్ధం కావాలి,
కాని చదివేప్పుడు...
శబ్ధం కావాలి... చప్పట్లతో
7.
ఉన్నదున్నట్టుగావుంటే,
విలువుంటుందా దేనికైనా,
కాలంతో ఆవిరవ్వాలి కోపం.
8.
మాటల్లో కొలవగలమా?
పండిన సంతృప్తి,
నిండిన మనసుదైతే
9.
సింహావలోకనం ఆలోచనకే, 
ఆవేశానిక్కాదు,
అడుగేసాక గొణుగుడొద్దు.
10.
పుస్తకం మూసేసినా,
అక్షరం వెంటాడుతోంది,
ఓ శ్రీశ్రీ! ఏం సిరా వాడావ్.
================ 
Date: 01.12.2013

Sunday, 1 December 2013

గుప్పెడు మల్లెలు-49

1.
ఎగిరిదూకే జలపాతానికి,
నిలిచి ఆగే సమయమేది,
విజ్ఞానదాహానికి విరామమేది?
2.
తెరమరుగయ్యారు,
ఎందరో త్యాగధనులు,
పదవున్నోడికే మంగళహారతులు.
3.
పరాయి విజయం,
తనదే అంటుంది,
బడాయి నిండిన నోరది.
4.
హలం అడుగంటా దిగితేనే,
పొలం పదునెక్కేది,
సమస్య లోతెరిగితేనే గెలిచేది.
5.
తేనెలో ముంచినంతనే,
వేప,తీపై పోతుందా,
మోసం ఎప్పుడు హాసం వెనుకే 
6.
నల్లపిల్లి ఎదురొస్తేనే,
వెనక్కెళ్లి పోతావ్,
ఇందరు శకునలతో ఎలాగరోయ్
7.
కొబ్బరి కొరికితేనే
తియ్యదనం,
తరచి చూస్తేనే తాత్పర్యం
8.
"అన్నీ తెలుసు" 
అనేది ఒక బ్రాంతి,
అక్కడితో ఎదుగుదలకు విశ్రాంతి.
9.
సరుకు నిఖార్సైతే
బజారులో నిలుస్తుందిలే,
ప్రతిభకి పట్టం దొరుకుతుందిలే
10.
వయసు మళ్లిందని,
పులి "మ్యావ్" అనదులే,
మనసుకి వార్ధక్యం లేదురోయ్
===================
Date: 24.08.2013